“స్వామిత్వా పథకం” కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని ప్రారంభించిన – ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ “స్వామిత్వా పథకం” కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. అనంతరం ఈ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు.

ఈ రోజు తమ ఇంటి ఆస్తి కార్డులు పొందిన ‘స్వామిత్వా పథకం’ లబ్ధిదారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు, ఇప్పుడు లబ్ధిదారులకు తమ ఇళ్లను సొంతం చేసుకునే హక్కు, చట్టపరమైన పత్రం ఉంటుందని చెప్పారు.  ఈ పథకం దేశంలోని గ్రామాల్లో చరిత్రాత్మక మార్పులను తీసుకురానుంది.  గ్రామీణ భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి ఈ పథకం సహాయపడుతుంది కాబట్టి, ఆత్మ నిర్భర్ భారత్ వైపు దేశం మరో పెద్ద అడుగు వేసినట్లైందని ఆయన పేర్కొన్నారు.

హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు, వారి ఇళ్ళకు సంబంధించిన చట్టబద్దమైన పత్రాలను ఈ రోజు అందజేసినట్లు ఆయన తెలిపారు.  వచ్చే మూడు – నాలుగు సంవత్సరాల్లో, దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ ఇటువంటి ఆస్తి కార్డులు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

జై ప్రకాష్ నారాయణ్, నానా జీ దేశ్ ముఖ్ వంటి ఇద్దరు ప్రముఖ నాయకుల జయంతి సందర్భంగా ప్రజలకు ఈ ఆస్తి కార్డులు పంపిణీ చేస్తున్నందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి ఒకే రోజున రావడంతో పాటు, వారి పోరాటం మరియు ఆదర్శాలు కూడా ఒకే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  నానాజీ మరియు జై ప్రకాష్, ఇద్దరూ గ్రామీణ భారతదేశం మరియు పేదల సాధికారత కోసం తమ జీవితమంతా పోరాడారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“గ్రామ ప్రజలు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారు, తమను తాము అభివృద్ధి చేకోలేరూ, సమాజాన్నీ అభివృద్ధి చేయలేరు” అన్న నానాజీ మాటలను ప్రధానమంత్రి గుర్తు చేసుకుంటూ,  మన గ్రామాల్లో అనేక వివాదాలను అంతం చేయడానికి యాజమాన్య హక్కు గొప్ప మాధ్యమంగా సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశాభివృద్ధిలో భూమి, ఇంటి యాజమాన్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.  ఆస్తి రికార్డు ఉన్నప్పుడు, పౌరులు విశ్వాసం పొందడంతో పాటు, పెట్టుబడికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆస్తి రికార్డు ఆధారంగా బ్యాంకు నుండి రుణం సులభంగా లభిస్తుంది.  ఉపాధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.   అయితే, ఇబ్బంది ఏమిటంటే, ఈ రోజు ప్రపంచంలోని జనాభాలో మూడవ వంతు మాత్రమే వారి ఆస్తికి సంబంధించిన చట్టబద్ధమైన రికార్డును కలిగి ఉన్నారు.  ఎలాంటి వివాదం లేకుండా, గ్రామస్థులు, తమ ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం లావాదేవీలను కొనడాగించుకోడానికి ఆస్తి కార్డులు సహాయపడతాయని, ఆయన తెలిపారు.  ఈ రోజు మనకు గ్రామాల్లో చాలా మంది యువకులు ఉన్నారు, వారు స్వయంగా ఏదైనా చేయాలనుకుంటున్నారని, ఆయన అన్నారు.  ఆస్తి కార్డు పొందిన తరువాత, వారు, తమ ఇళ్ళపై బ్యాంకుల నుండి రుణాలు సులభంగా పొందవచ్చు.  మ్యాపింగు మరియు సర్వేలో డ్రోన్లను ఉపయోగించడం వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రతి గ్రామానికి సంబంధించిన ఖచ్చితమైన భూ రికార్డులను సృష్టించవచ్చునని, ఆయన చెప్పారు.   ఖచ్చితమైన భూ రికార్డుల కారణంగా, గ్రామంలో అభివృద్ధికి సంబంధించిన పనులు కూడా తేలికగా ఉంటాయి, ఇది ఈ ఆస్తి కార్డుల యొక్క మరొక ప్రయోజనం.

గత 6 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్న పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ‘స్వామిత్వా పథకం’ సహాయపడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. గత 6 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి తీసుకున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్ల వంటి క్రమబద్ధమైన పద్ధతిలో, “స్వామిత్వా పథకం” మన గ్రామ పంచాయతీలకు, గ్రామ నిర్వహణను సులభతరం చేస్తుంది.  గ్రామాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి, గత 6 సంవత్సరాలలో, నిరంతర ప్రయత్నాలు జరిగాయని, ఆయన, చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో, గ్రామాల్లో జరగని అపూర్వమైన అభివృద్ధి, గత 6 ఏళ్ళలో గ్రామాల్లో జరిగిందని ఆయన అన్నారు.  బ్యాంకు ఖాతా కలిగి ఉండటం, విద్యుత్ కనెక్షన్ పొందడం, మరుగుదొడ్ల సౌకర్యం, గ్యాస్ కనెక్షన్ పొందడం, పక్కా ఇల్లు, పైపుల ద్వారా తాగునీటి కనెక్షన్ కలిగి ఉండటం వంటి గత 6 సంవత్సరాలలో గ్రామస్తులకు లభించిన అనేక ప్రయోజనాలను ఆయన వివరించారు. దేశంలోని ప్రతి గ్రామాన్ని ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్‌తో అనుసంధానించే ప్రధాన కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోందని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలను విమర్శిస్తూ, మన రైతులు స్వావలంబన కావాలని కోరుకోని వారు వ్యవసాయ రంగంలో సంస్కరణలతో సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.  చిన్న రైతులు, పాడి రైతులు మరియు మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టడంతో, బ్రోకర్లు మరియు మధ్యవర్తులు సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే వారి అక్రమ ఆదాయం ఆగిపోయింది.  యూరియా యొక్క వేప పూత, రైతుల బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వంటి పథకాలలో అవకతవకలను అరికట్టడానికి చేపట్టిన వివిధ చర్యలను కూడా ఆయన వివరించారు.  ఆ అవకతవకలను అరికట్టడం వల్ల ప్రభావితమైన వారే,  ఈ రోజు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  వారి వల్ల ఈ దేశంలో అభివృద్ధి నిలిచిపోదనీ, గ్రామాలను, పేద ప్రజలను స్వావలంబన దిశగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయనీ, ఆయన హామీ ఇచ్చారు.   ఈ ఆశయ సాధనకు  ‘స్వామిత్వా పథకం’ పాత్ర కూడా చాలా ముఖ్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు.