విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పింఛను పొందేలా నిబంధనలను సడలించారు. ఒకవేళ సదరు కుమార్తెకు విడాకుల మంజూరు పూర్తికాకున్నా, విడాకుల కోసం ఆమె న్యాయస్థానానికి అర్జీ పెట్టుకుని ఉన్నా కుటుంబ పింఛను పొందేందుకు అర్హురాలే. న్యాయస్థానానికి అర్జీ పెట్టుకునే సమయానికి, ఉద్యోగి లేదా పింఛనుదారైన ఆమె తల్లి లేదా తండ్రి బతికివుంటేనే కుటుంబ పింఛనుకు అర్హురాలు.

పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ విభాగం తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణల గురించి వివరిస్తూ, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్యోగి లేదా పింఛనుదారైన తల్లి లేదా తండ్రి బతికువున్న సమయంలో విడాకుల ప్రక్రియ పూర్తయితేనే, ఆ కుమార్తెకు కుటుంబ పింఛను వర్తించేలా గత నిబంధనలు ఉన్నాయని చెప్పారు. విడాకులు పొందిన కుమార్తెల జీవన సౌలభ్యాన్ని కొత్త నిబంధన పెంచడమేగాక, వారు గౌరవనీయంగా, సమాన హక్కులతో సమాజంలో జీవించేలా చేస్తుందని అన్నారు.

పింఛనుదారైన తండ్రి లేదా తల్లి మరణించిన తర్వాత వైకల్య ధృవపత్రం సమర్పించినప్పటికీ, దివ్యాంగ సంతానం లేదా తోబుట్టువులకు కుటుంబ పింఛను మంజూరు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, తండ్రి లేదా తల్లి మరణానికి ముందే ఆ వైకల్యం నిర్ధరణ అయితేనే పింఛనుకు అర్హులవుతారు. దీంతోపాటు, దివ్యాంగ పింఛనుదారుల జీవన సౌలభ్యం పెంచేలా, అతని సహాయకుడికి ఇచ్చే నెల భత్యాన్ని రూ.4,500 నుంచి రూ.6,700కు పెంచినట్లు మంత్రి తెలిపారు.

పింఛన్ల విభాగం తీసుకొచ్చిన ముఖ్య సంస్కరణల్లో ‘డిజిటల్‌ జీవన ధృవపత్రం‌’ ఒకటని మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వివరించారు. పదవీ విరమణ తర్వాత, విదేశాల్లో ఉన్న సంతానం దగ్గరకు వెళ్లి స్థిరపడిన వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఏకీకృత సూచనలపై సర్క్యులర్ జారీ చేశామన్నారు. విదేశాల్లో ఉన్న సంబంధిత బ్యాంకు శాఖ, భారత రాయబార కార్యాలయం లేదా హై కమిషనరేట్‌ వారికి జీవన ధృవపత్రం అందించాలని, కుటుంబ పింఛను ప్రారంభించాలని ఆ సూచనల్లో పేర్కొన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అదే సమయంలో, బ్యాంకుల దగ్గరకు వెళ్లలేని పింఛనుదారులను దృష్టిలో ఉంచుకుని, వారి ఇళ్ల వద్దకే వెళ్లి జీవన ధృవపత్రం అందించాలని బ్యాంకులకు సూచించినట్లు చెప్పారు.

  • Website Designing